దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఖాళీల సంఖ్య 20వేల మైలురాయిని దాటింది. గ్రూప్-డి నియామకాల ప్రక్రియ డివిజనల్ కేంద్రాల నుంచి ఆర్ఆర్బి, ఆర్ఆర్సిలకు బదలాయింపుతో వచ్చిన వినూత్న మార్పులతో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. స్థానికులకంటే, స్థానికేతరులే (ఇతర రాష్ట్రాలకు చెందిన వారు) దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అధిక సంఖ్యలో ఉద్యోగాలు పొందడం, అనంతరం తమ తమ ప్రాంతాలకు తరలి పోతున్నందున ఖాళీల సంఖ్య కూడా షేర్ మార్కెట్లో సెన్సెక్ను తలపించే రీతిలో పెరిగిపోతోంది.
రైల్వే శాఖ 2019లో వెల్లడించిన ఆర్ఆర్సి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ ఆర్ఆర్సి – 01/2019 ప్రకారం దక్షిణ మధ్యరైల్వేలో మొత్తం 9,328 సాధారణ ఖాళీలు ఉండగా, రైల్వే యాజమాన్యం ఆధ్వర్యంలో యాక్ట్ అప్రెంటీస్ కోర్సు పూర్తి చేసిన వారికై 1,867 పోస్టులను కేటాయింపుతో కలిపి దాదాపుగా మొత్తం 11,195 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్/అక్టోబర్ లో ఆన్లైన్ పద్దతి ప్రకారం కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
సిబిటి పరీక్షల నిర్వహణ జాప్యం కావడంతోపాటు, 2020 నుంచి కరోనా మహమ్మారి కారణంగా సిబిటి పరీక్షల నిర్వహణకు బ్రేక్ పడింది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో రైల్వే శాఖ గత ఏడాది ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11ల మధ్య రోజుకు మూడు షిఫ్ట్లలో సిబిటి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఈ ఏడాది జనవరి 12 నుంచి 22 వరకు గట్టి నిఘా నేత్రాల మ ధ్య శారీరక సామర్థ్యం (పిఇటి) పరీక్షలను నిర్వహించింది. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 07 నుంచి 13 వరకు సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షల ప్రక్రియను సైతం పూర్తి చేసింది.
ఈ పరీక్షల్లో దక్షిణ మధ్య రైల్వే జోన్ మొత్తం 7,305 మంది అభ్యర్థులతోపాటు మరో 564 మంది రైల్వే యాజమాన్యం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యాక్ట్ అప్రెంటీస్ కోర్సు పూర్తి చేసిన అప్రెంటీస్లు కలిపి మొత్తం 7,869 మంది అభ్యర్థులు గ్రూప్-డికు ఎంపికయ్యారు. ఆర్ఆర్సి-01/2019లో 11,195 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా ఇందులో కేవలం 7,869 మంది అభ్యర్థులు మాత్రమే ఎంపికైనందు, మిగిలిన 3,326 మపోస్టులను ఖాళీల బ్యాంకు ఖాతాలో జమ అయినట్టే.
ఈ ఏడాది ఫిబ్రవరి 03న పార్లమెంట్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రాజ్య సభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే అడిగిన రాతపూర్వక ప్రశ్న(నెంబర్ 302) కు సమాధానంగా దక్షిణ మధ్య రైల్వే జోన్లో మొత్తం 16,829 నాన్ గెజిట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాత పూర్వకంగా వెల్లడించారు. ఈ లెక్కన 2019 ఆర్ఆర్సి నోటిఫికేషన్లో భర్తీకి నోచుకోకుండా మిగిలిపోయిన 3,326 గ్రూప్-డి పోస్టులతోపాటు 16,829 నాన్ గెజిట్ పోస్టులు కలిసి దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 20,105 గ్రూప్-సి, డి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు మరో 65 గెజిటెడ్ అధికారుల పోస్టులు సైతం ఖాళీగా ఉన్నట్లు అభిజ వర్గాల సమాచారం.